Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నుదుట బొట్టు...చేతిలో లడ్డూ ప్రసాదం.. దర్శకుడు వర్మ కొత్త గెటప్‌!

  • కాణిపాకం వినాయకుడు, తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకున్న రామ్‌గోపాల్‌ వర్మ
  • ఎన్టీఆర్‌ లక్ష్మీస్‌ సినిమా కోసమే అని ట్వీట్‌
  • ఈ సాయంత్రం సినిమా వివరాలు వెల్లడిస్తానని ప్రకటన
ఆయనకు వివాదాలు కొత్తేమీ కాదు... దేవుడు పేరు చెబితే ఇంతెత్తున లేస్తారు... పక్కా నాస్తికుడినని చెప్పుకుంటారు. అటువంటి ఆయన దేవుడి గుడిలో ప్రత్యక్షమైతే, స్వామి వారి ప్రసాదాన్ని చేతిలో పట్టుకుని దర్శనమిస్తే... ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రత్యేకతే అది. ఏది చేసినా తనదైన స్టైల్‌లో చేస్తాడీ దర్శకుడు.

ఇంతకీ విషయం ఏమిటంటే... నాస్తికుడినని చెప్పుకునే రామ్‌గోపాల్‌ వర్మ ఒకే రోజు రెండు ప్రముఖ దేవాలయాలను దర్శించుకున్నారు. ఒకటి ప్రఖ్యాత కాణిపాకం వినాయకుని గుడికాగా, రెండోది తిరుమల శ్రీవారి ఆలయం. గురువారం తాను తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని ట్వీట్‌ చేసిన వర్మ అన్నట్లుగానే స్వామిని దర్శించుకున్నారు.

నుదుట సిందూరం, చేతిలో స్వామి వారి లడ్డూ, సంప్రదాయ వస్త్రధారణతో దిగిన ఫొటోలు పోస్టు చేసి తనదైన శైలిని చాటుకున్నారు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ కోసం దివంగత ఎన్‌.టి.రామారావే తనను ఇలా మార్చేశారని కింద క్యాప్షన్‌ పెట్టి ఆశ్చర్యపరిచారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు తిరుపతిలోని శిల్పారామంలో నిర్వహించే ప్రెస్‌మీట్‌లో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాకు సంబంధించిన విశేషాలు వెల్లడిస్తానని వర్మ తెలిపారు.

జీవీ ఫిల్మ్స్‌ పతాకంపై రాకేష్‌ రెడ్డి నిర్మిస్తున్నఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఓ వీడియోను వర్మ యూ ట్యూబ్‌లో విడుదల చేశారు. అందులో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ సేవలు, ఆయన చనిపోయాక అంతిమ యాత్ర వివరాలు ఉన్నాయి.
NTR lakshimees
ramgopal varam
tirumala

More Telugu News